
సరిహద్దుల్లో చైనా దూకుడుకు కేంద్రం తీరే కారణమన్న ఫరూక్ అబ్దుల్లా
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా దూకుడుకు ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ అంగీకరించదని, డ్రాగన్ మద్దతుతో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చైనా అధ్యక్షుడిని ఎన్నడూ ఆహ్వానించలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా నేతను ఆహ్వానించడమే కాకుండా ఆయనను చెన్నైకి తీసుకువెళ్లి ఇరువురు నేతలు విందు ఆరగించారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. చదవండి : చర్చలతో చైనా దారికి రాదు
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆమోదయోగ్యం కాదని ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో కశ్మీర్ సమస్యలను నివేదించేందుకు కూడా తనను అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తొలగించాయి.