ఒడిశాలోని బాలాసోర్‌లో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంతో 275కు పైగా ప్రయాణికులు మృతిచెందారు. 1175 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతుల సంఖ్య వందల్లో ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు రైలులో వెళ్లిన తమ వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక ఇప్పటికీ చాలామంది ఆసుపత్రులలో వెదుకులాట సాగిస్తున్నారు.
అటువంటివారిలో విజేంద్ర రిషిదేవ్ ఒకరు. ఆయన తన కుమారుడు సూరజ్ ఆచూకీ తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో అతను బాలాసోర్ చేరుకుని బహానాగా హైస్కూలులోని శవాగారం దగ్గరకు వచ్చి కుమారుని కోసం వెదుకులాట సాగించారు. అయినా ఫలితం లేకపోయింది. సూరజ్ తన అన్నదమ్ములతో కలసి ఉద్యోగవేటలో చెన్నై వెళుతున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 40 ఏళ్ల విజేంద్ర బీహార్‌లోని పూర్ణియాలో కూలి పనులు చేస్తుంటాడు. టెన్త్ పాసయిన సూరజ్ తన సోదరునితో కలసి చెన్నైలో ఉద్యోగం చేయాలని బయలుదేరాడు.
మరో బాధితుడు వినోద్ దాస్ ఈ ప్రమాదంలో తన భర్య ఝరన్ దాస్(42), కుమార్తె విష్ణుప్రియదాస్(24), కుమారుడు సందీప్ దాస్(21)లను కోల్పోయాడు. 48 ఏళ్ల వినోద్ దాస్ తన కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తుపట్టారు. వారి మృతదేహాలు ఎన్‌ఓసీసీఐ పార్కువద్ద ఏర్పాటు చేసిన శవాగారంలో ఉన్నట్లు గుర్తించారు. కాగా బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాకు చందిన అజోతీ పాశ్వాన్ ఈ రైలు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బెంగళూరు నుంచి వస్తున్నానని, తనతోపాటు తన భార్య, ఏకైక కుమారుడు కూడా ఉన్నారన్నారు. తన భార్య గాయాలపాలై చికిత్స పొందుతున్నదని, కుమారుని ఆచూకీ ఇంతవరకూ లభ్యంకాలేదని తెలిపారు.
చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
Comments
Please login to add a commentAdd a comment