ఒడిశాలో జూన్ 2న ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో 291 మంది ప్రాణాలు కోల్పోగా,1100 మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కుటుంబ సభ్యులు.. రైల్వే అధికారులపై పలు ఆరోపణలు చేస్తున్నారు.
కటక్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని నాహర్‌పాడ్ గ్రామంలో ఉంటున్న కొరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గుణనిధి మొహంతి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అధికారులు తమకు గుణనిధిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.
కుమారుని రాక కోసంఎదురుచూస్తూ..
గుణనిధి మొహంతి తండ్రి విష్ణు చరణ్ మొహంతి మాట్లాడుతూ..‘ఈ ఘోర రైలు ప్రమాదానికి మా కుమారుడే కారణమంటూ గ్రామంలోని వారంతా ఆరోపిస్తున్నారు. కానీ మావాడు గత 27 ఏళ్లుగా రైలు నడుపుతున్నాడు. ఎప్పుడూ ఎటువంటి తప్పుగానీ, పొరపాటు గానీ చేయలేదు. ఇంతకీ ఆరోజు సాయంత్రం ఏమి జరిగిందో మాకు ఏమి తెలుస్తుంది? ఇప్పటి వరకూ మా కుమారునితో మాట్లాడనే లేదు. మా కుమారుడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తున్నాం’ అని అన్నారు.
జూన్ 2న గుణనిధి మొహంతి.. ఖరగ్‌పూర్ నుంచి భువనేశ్వర్ వరకూ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నాడు. ఈ నేపధ్యంలో బాలాసోర్ బహనాగాలో రైలు లూప్ లైన్‌లోకి వెళ్లిపోయింది. ఆ మార్గంలో అప్పటికే ఒక గూడ్సు రైలు నిలిపివుంది. దీంతో ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. అనంతరం యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్- కోరమండల్ బోగీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 291 మంది మృతి చెందారు.
ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గుణనిధి మొహంతి తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో అధికారులు అతనిని భువనేశ్వర్‌లోని ఏఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతున్నదని సమాచారం. గుణనిధి మొహంతి రాకకోసం అతని తండ్రి విష్ణు చరణ్ మొహంతి ఎదురు చూస్తున్నాడు.
అన్నయ్యను కలిసేందుకు వెళ్లగా..
దుర్ఘటన జరిగిన రెండు రోజుల తరువాత గుణనిధి తమ్ముడు రంజీత్ మొహంతీ అతనిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. అప్పుడు అతనితో వైద్యులు గుణనిధి తీవ్రంగా గాయపడ్డాడని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిపారు. ఇదే విధంగా గుణనిధి అన్నయ్య కూడా ఆసుపత్రికి వెళ్లగా అతను కూడా సోదరుడుని కలుసుకోలేకపోయాడు.
హెల్త్ అప్‌డేట్‌పై అధికారుల అభ్యంతరం
ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వైద్యవిభాగానిక చెందిన ఒక వైద్యాధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితమే గుణనిధిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. అయితే గుణనిధి తండ్రి మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడున్నాడో తమకు తెలియడం లేదని, ఇప్పటీకీ తమ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడని తాము భావిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: అది బ్లూ సిటీ ఆఫ్ ఇండియా.. ఉదయం, సాయంత్రం వేళ్లలో ఏం చూడొచ్చంటే..
Comments
Please login to add a commentAdd a comment