ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మోటారు వెహికల్ యాక్ట్‌లో తాజాగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జరిమానాల మోత మోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
సాక్షి, చెన్నై: రాజధాని చెన్నై సహా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం సిటీ దాటేందుకే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనూ కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అనేక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారిని, త్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లే కుర్ర కారును, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారిని, బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారిని ఇకపై ఊపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఫలితంగా జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలు కూడా మరింత కఠినమయ్యాయి. ఇందుకు తగ్గట్లు చెన్నైలో అనేక మార్గాల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నేరగాళ్లను, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టనున్నారు.
అమల్లోకి కొత్త జరిమానాలు..
ఇకపై అతివేగంగా వాహనం నడిపే వారికి తొలిసారి రూ. 1000, మళ్లీ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేల విధించనున్నారు. మానసికంగా, ఆరోగ్య రీత్యా సామర్థ్యం లేని వారు వాహనాలు నడిపితే తొలిసారి రూ. 1000, రెండోసారి రూ. 2 వేలు వసూలు చేస్తారు. అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వకుండా వ్యవహరించే వాహనదారులకు విధించి ఫైన్‌ను రూ. 10 వేలుకు పెంచారు.
నిషేధిత ప్రాంతాల్లో హారన్ ఉపయోగిస్తే రూ. 1000, రిజిస్ట్రేషన్లు సక్రమంగా లేని వాహనాలకు తొలిసారి రూ. 2,500, తర్వాత రూ. 5,000 , అధిక పొగ వెలువడే వాహనాలకు రూ. 10 వేలు, బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారి నుంచి రూ. 10 వేల వరకు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి రూ. 1000, సిగ్నల్ దాటితే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు.
లా అండ్ ఆర్డర్ పోలీసులకూ ఆ అధికారం..
ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇకపై లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్‌ఐ, ఆ పైస్థాయి అధికారుల కూడా వాహనాలు తనిఖీ చేసేందుకు, జరిమానా విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మోటారు వెహికల్ యాక్ట్‌లో మార్పులు చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులు మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు జరిమానా విధించే నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment