సోనియా గాంధీ, రాహుల్‌తో గులాం నబీ ఆజాద్(ఫైల్)
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన కొంతకాలంగా పార్టీపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా దశాబ్దాల పాటు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించారు.
ఏ సంక్షోభాన్నయినా సులువుగా పరిష్కరిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా పార్టీలో చీలికలొచ్చినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నా అధిష్టానానికి మొదట గుర్తుకొచ్చే పేరు ఆజాదే. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా అంతర్గత సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించారు.
నాయకత్వంపై బహిరంగ విమర్శలు
1970లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ అర్ధ శతాబ్దం పాటు గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా ఆజాద్‌కు పేరుంది. అలాంటి నేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో పార్టీకి కాయకల్ప చికిత్స జరగాలనే డిమాండ్‌తో 2020లో ఏర్పాటైన జీ23 సభ్యుల గ్రూప్‌లో ఆజాద్ కీలకంగా వ్యవహరించడం ఆందరినీ విస్మయానికి లోను చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ మునిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం రేపాయి. నాటినుంచీ పలు సందర్భాల్లో పార్టీ నాయకులపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా ఓటముల నేపథ్యంలో పార్టీలోని ఫైవ్ స్టార్ కల్చర్‌ను ఏకిపారేశారు. ‘టికెట్ రాగానే మా నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఏసీ కారులేకుండా బయటకు అడుగు కూడా వేయరు. ఈ సంస్కృతి మారనిదే ఎవరూ గెలవలేరు‘‘ అన్నారు.
మోదీపై ‘వీడ్కోలు’ పొగడ్తలు
ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారన్న విశ్లేషణలు వినిపించాయి. దాన్ని ఆయన స్వీకరించరని పార్టీ ఆశించింది. కానీ ఆజాద్ మౌనమే వహించారు. ఎనిమిదిసార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన, తాజాగా ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగం కూడా కలకలం రేపింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధాని మోదీని కూడా ఆకాశానికెత్తారు. ‘‘మోదీపై నేనెన్నోసార్లు మాటల దాడి చేశా. అయినా ఆయనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అందుకు ధన్యవాదాలు. ఆయనకు కృతజ్ఞుడినై ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు.
సొంత కుంపటే!
బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే ఆజాద్ తెరదించారు. ‘‘కశ్మీర్‌లో ఎన్నికలున్నందున సొంత పార్టీ పెట్టి బరిలో దిగుతా. అక్కడ గెలిచాక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తా’’ అని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ పార్టీ వెనక బీజేపీ హస్తమే ఉందంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment