లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2.5 లక్షల మందికి సంబంధించిన కేసులను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ ఆదేశించారు. ఇంతకీ ఆ కేసులంటే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసినవి. అప్పట్లో తీవ్రంగా పరిగణించిన కేసులు ఇప్పుడు అంతగా ప్రాధాన్యం లేవని వాటిని కొట్టివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
కరోనా వ్యాప్తి నివారణకు గతేడాది లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావడం.. మాస్క్‌లు ధరించకపోవడం.. భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలపై అప్పట్లో ప్రజలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసులను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 2.5 లక్షల మందిపై కేసులు ఉన్నాయని సమాచారం. ఈ కేసుల మాఫీతో వారందరికీ ఉపశమనం కలగనుంది. ఆ సమయంలో ప్రజలపై నమోదు చేసిన చిన్న కేసులను ఉపసంహరించాలని సీఎం ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌లో సెక్షన్ 188ను ఉల్లంఘించడంతో పెద్ద ఎత్తున ఆ సెక‌్షన్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని రోజుల కిందట లాక్‌డౌన్ సమయంలో వ్యాపారులపై కూడా కేసులు నమోదవగా వారంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో వారి కేసులు ఎత్తేశారు. ఇప్పుడు సామాన్యులపై కూడా ఎత్తివేయనున్నారు.
ఆశీర్వాద్ గోధుమపిండి అని, విజయ పాలు అని, అప్పడ్డాలు వేయడానికి వెళ్తున్నా అని తదితర కారణాలతో అకారణంగా బయటకు వచ్చినవి మనం చూసే ఉన్నాం కదా. అలాంటి కేసులను ప్రస్తుతం ప్రభుత్వం మాఫీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment