న్యూఢిల్లీ: హథ్రాస్ మృతురాలికి అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడంతో యూపీ పోలీసుల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. అర్ధరాత్రి 2.30 నిమిషాలకు ఎందుకు దహనం చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్‌లో యూపీ సర్కార్ వివరించింది. బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారని, ఆ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో అర్థరాత్రి దహనం చేసినట్లు తెలిపింది. సఫ్దార్‌గంజ్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందని, ఆ ఘటనకు కులం రంగు పూశారని యూపీ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు ఇవాళ యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం.. హత్రాస్ క్రైమ్‌సీన్‌కు వెళ్లి సమాచారం సేకరిస్తున్నది. (హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు)
హత్రాస్ కేసులో సీబీఐ విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని యూపీ సర్కార్ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగాలని యూపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విషప్రచారం నిర్వహించారని అఫిడవిట్‌లో యోగి ప్రభుత్వం ఆరోపించింది. హత్రాస్ ఘటన పట్ల ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకు సమర్పించారు. అర్థరాత్రి దహనం చేసేందుకు యువతి తల్లితండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment