![UP govt agrees to appointment of retired judge to monitor probe - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/khg.jpg.webp?itok=3bi-2hD6)
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నియమించిన సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డు న్యాయమూర్తిని నియమించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ధర్మాసనం సరైన వ్యక్తిగా భావించి ఎవరిని నియమించినా యూపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈ విషయంలో సదరు అధికారి సమర్థతే తప్ప, రాష్ట్రంతో సంబంధం లేదు’అని హరీశ్ సాల్వే ధర్మాసనానికి నివేదించారు.
దీంతో న్యాయమూర్తి పేరును బుధవారం ఖరారు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు ప్రగతిని ఈ న్యాయమూర్తి రోజువారీ సమీక్షిస్తారని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలో దిగువ స్థాయి..సబ్ ఇన్‌స్పెక్టర్, డీఎస్‌పీలు అదికూడా లఖీమ్‌పూర్ ఖేరికి చెందిన అధికారులే ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. యూపీ క్యాడర్‌లో సొంత రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా అందజేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్‌ను బదిలీ చేశారన్న పిటిషనర్ అభ్యర్థనపైనా పరిశీలన జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. పరిహారం దక్కని వారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునేలా చేస్తానని యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment