సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు సంబంధించి సాక్షులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొంటే ఘటనలో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులు మాత్రమే ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ ఉదంతంలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే.
ఈనెల 3న లఖింపూర్ ఖేరి హింసాకాండలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన కేసులో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో సహా ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.
చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి)
వేల మంది ఎదుట జరిగింది కదా?
యూపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కరు మినహా మిగతా అందరినీ ఇంకా పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించగా .. స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్ తెలిపారు. వేలాది మంది రైతులు ర్యాలీలో ఉంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులా అని ధర్మాసనం ప్రశ్నించగా... పత్రికల్లో ప్రకటన ఇచ్చామని, ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయగా దాన్ని ల్యాబ్‌కు పంపామని సాల్వే తెలిపారు. సాక్షులకు రక్షణ కల్పించాలని, సీసీటీవీల ఏర్పాటు, ఇంటి వద్ద భద్రత కల్పించడం చేయాలని సీజేఐ ఆదేశించారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించాలని ధర్మాసనం పేర్కొంది. ఘటనలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భర్త మృతి చెందారని, హంతకులు బహిరంగంగా తిరుగుతూ తనని బెదిరిస్తున్నారని రూబీ దేవి అనే మహిళ ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. దీనిపై ఏం చేశారని సీజేఐ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సాల్వే తెలిపారు. జర్నలిస్టు, రూబీ దేవి భర్త హత్యలపై వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment