
బసంతి ఒడిలో బాబి
బసంతి నిద్రలేచి తన పక్కన పడుకుని ఉన్న బాబీ కోసం చూసింది. ఓ చిరుతపులి బాబీ కాలును నోటితో కరుచుకుని లాక్కుపోవటం చూసి షాక్ తింది.
భోపాల్ : ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా చిరుతపులితో పోరాడి మనవరాలిని కాపాడుకుంది ఓ వృద్ధజంట. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్హల్ పట్టణానికి సమీపంలోని దుర గ్రామానికి చెందిన జై సింగ్ గుజర్, బసంతి బాయి భార్యభర్తలు. గురువారం రాత్రి మనవరాలు బాబీతో కలిసి ఇంట్లో నేలపై పడుకుని ఉన్నారు.
అర్థరాత్రి సమయంలో బసంతి నిద్రలేచి తన పక్కన పడుకుని ఉన్న బాబీ కోసం చూసింది. ఓ చిరుతపులి బాబీ కాలును నోటితో కరుచుకుని లాక్కుపోవటం చూసి షాక్ తింది. నోటిలోంచి అరుపు బయటకు రాకముందే దాని మీదకు ఉరికి దాడి చేయటం మొదలుపెట్టింది. దాన్ని బయటకు వెళ్లనివ్వలేదు. అనంతరం గట్టిగా అరవసాగింది.
ఆమె అరుపులు విన్న భర్త నిద్రలేచి దాని మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. ఇద్దరూ చిరుత పులి మూతి, నోటిపై కొడుతూ బాబిని దాని నోటినుంచి బయటకు లాగసాగారు. అయితే, చిరుత బాబిని విడిచిపెట్టి, దంపతులపై దాడికి దిగింది. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయినా వాళ్లు వెనకడుగువేయలేదు. వీరి అరుపులు విన్న జనం కర్రలు, ఆయుధాలతో అక్కడికి రావటంతో భయపడిపోయిన చిరుత అడవిలోకి పారిపోయింది.
చదవండి : మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!