సాక్షి, వెబ్‌డెస్క్: తమిళనాడు కూనూర్ సమీపంలో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారు. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్‌కు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు.
ఈ క్రమంలో మన మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. వేర్వేరు సందర్భాలలో ఈ తుపాకీ గౌరవ వందనం వేర్వేరుగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నింటికి సమాధానాలు.. ఇక్కడ లభిస్తాయి.
అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే.. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం.. యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు.
ఎవరికి, ఎన్ని తుపాకీ వందనాలు సమర్పిస్తారంటే..
భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు) సమర్పిస్తారు. త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే.. 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన గౌరవార్ధం.. ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు.
మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు.
తొలిసారి మహత్మ గాంధీకి
ఇటీవలి కాలంలో మరణించిన వ్యక్తికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో.. లేదో నిర్ణయించే విధంగా నిబంధనలు మార్చబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు.
తుపాకీ వందనం వెనక ఉన్న చరిత్ర...
బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు. దీనిని భారత చక్రవర్తికి (బ్రిటీష్ క్రౌన్) మాత్రమే అందించారు. దీని తర్వాత 31-గన్ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఉంటుంది. ఇది రాణి, రాజ కుటుంబ సభ్యులకు సమర్పిస్తారు. ఇదే పద్దతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్‌కు కూడా పాటిస్తారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు.
ఇక భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో.. 21 తుపాకీ వందనం సమర్పిస్తారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక స్వాంతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు.
చదవండి:
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు
Comments
Please login to add a commentAdd a comment