సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర‍్ధన్ పేర్కొన్నారు. సండే సంవాద్‌లో తన ఫాలోయర్లతో ప్రతి వారం జరిపే సంప్రదింపుల్లో భాగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం పలు వ్యాక్సిన్‌లు తొలి, మలి, మూడవ దశ పరీక్షలు జరిపే దశలో ఉన్నాయని, ఈ పరీక్షల ఫలితాలు వ్యాక్సిన్ వ్యూహాన్ని నిర్ధారించడంలో ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. వైరస్ సోకే ముప్పున్న వ్యక్తులతో పాటు వైరస్ కారణంగా మరణించే అవకాశాలు అధికంగా ఉన్న గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి తెలిపారు. చదవండి : 70 శాతం మందికి వ్యాక్సిన్ అందేది అప్పుడే!
వ్యాక్సిన్‌ల అందుబాటు ఆధారంగా పలు కోవిడ్-19 వ్యాక్సిన్‌లను సమీకరించే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సీఎస్‌ఐఆర్-ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఫెలుదా పేపర్ స్ర్టిప్ పరీక్షను మరికొద్ది వారాల్లో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కోవిడ్-19ను గుర్తించడంలో దీనికి 98 శాతం కచ్చితత్వం ఉన్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఇక రానున్న పండగ సీజన్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని, ఇది వైరస్ వ్యాప్తిని పెంచుతుందని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment