సాక్షి, ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని ముంబై ట్రాఫిక్ పోలీసు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో రూ.500 జరిమాన వసూలు చేస్తారు. లేదంటే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన అధికారిక సర్క్యూలర్ ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసింది. అయితే వెనక సీట్లో కూర్చున్న హెల్మెట్ ధరించని వారికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత పట్టుబడితే బైక్ నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు, జరిమాన వసూలు చేస్తామని హెచ్చరించారు. దీంతో బైక్ నడిపేవారు లేదా యజమానులు ఇప్పటినుంచే అదనంగా ఒక హెల్మెట్ కొనుగోలు చేసుకుని ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.
యథేచ్ఛగా నియమాల ఉల్లంఘన
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం 2020 మార్చిలో అమలుచేసిన లాక్‌డౌన్ వల్ల అనేకమంది వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించడం మానేశారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం, ట్రిపుల్ సీటు డ్రైవింగ్, నో ఎంట్రీ, రాంగ్ రూట్లో వాహనాలు తోలడం, సిగ్నల్స్ జంప్ చేయడం లాంటి అనేక ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని ఎత్తివేసినప్పటికీ వాహన చోదకులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపటం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్‌లో వెళ్లడం లాంటి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు.
ముఖ్యంగా బైక్‌లకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నడిపేవారితోపాటు వెనక కూర్చున్న వారికి కూడా తలకు హెల్మెట్ లేకపోవడంవల్ల ప్రాణనష్టం అధికంగా జరుగుతోంది. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు 1988, సెక్షన్ 126, 194–డి ప్రకారం తలకు హెల్మెట్ లేని ద్విచక్ర వాహన చోదకులకు రూ.500 జరిమాన, అలాగే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే నియమాలున్నాయి. ఇప్పుడు ఈ నియమాలను అమలు చేయనున్నారు.
చదవండి: జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా
దీంతో ఇకనుంచి బైక్ నడిపే వారితోపాటు వెనక సీట్లో కూర్చునే వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. అందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్ర«ధాన నగరాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో ముంబై అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను, ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment