న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని తీసుకురావాలనే కొన్ని దేశాలు ప్రతిపాదనల్ని జీ–7 సదస్సు వేదికగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత వివక్షాపూరిత చర్యగా అభివర్ణించింది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–7 దేశాల సదస్సుకు ఈ ఏడాది భారత్‌ను అతిథిగా ఆహ్వానించారు. జీ–7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హర్షవర్ధన్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ కొరతని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
భారత్‌లో కేవలం 3 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాల సరఫరా, పంపిణీ, రవాణా, సామర్థ్యం వంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే అది వివక్ష చూపించడమే’’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాగా ఈ సదస్సులో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వ్యాక్సిన్ పాస్‌పోర్టు అంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నామని ధ్రువపత్రం చూపించాలి. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్‌లలో ప్రజలు వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరచాలి. విదేశీ ప్రయాణం సమయంలో ఆ దేశాలు ఈ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటాయి. కరోనాని కట్టడి చేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయాలని అమెరికా, కొన్ని యూరప్ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అదే జరిగితే భవిష్యత్‌లో వ్యాక్సిన్ పాస్‌పోర్టు ఉంటేనే విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment