మీరు ఏదైన లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా కూడా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
సిబిల్ స్కోరు అంటే ఏమిటి?
సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL). మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యాయా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి.
సిబిల్ ట్రాన్స్యూనియన్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను సూచించే 3 అంకెల సంఖ్య. సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అధిక స్కోరు ఉంటే త్వరగా రుణాలు ఆమోదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి, స్కోరును ఎక్కువ శాతం 750 పైన ఉండే విధంగా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే మీరు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ స్కోర్ కనుక 750 కంటే తక్కువగా ఉంటే ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- మొదటగా మీరు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించే క్రమంలో కచ్చితంగా సమయానికి తిరగి చెల్లించడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సమయానికి ఈఎంఐ చెల్లించక పోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
- రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వండి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించండి. హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. ఒకవేళ మీరు కనుక రెండు రుణాలు తీసుకుంటే అసురక్షిత రుణాలు ముందుగా క్లోస్ చేయండి.
- మల్టీపుల్ క్రెడిట్ కార్డులను తీసుకోవడం మానేయండి. ఎక్కువ లోన్స్ లేదా కార్డులు తీసుకోవడం వల్ల రుణ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో అంతిమంగా క్రెడిట్ స్కోర్‌గా ఎఫెక్ట్ పడుతుంది. గడువు తేదీ కంటే ముందే క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించండి. ఎప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించండి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగాఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
- ఉమ్మడిగా రుణాలు తీసుకోవడం తగ్గించండి లేదా గ్యారెంటీగా ఉండటం మానుకోండి, ఎందుకంటే అవతలి వ్యక్తి వల్ల ఏదైనా డిఫాల్ట్ ఉంటే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.
- ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్‌కు వ్యతిరేకంగా సెక్యూర్ కార్డు తీసుకుంటే, ఆ బకాయిలను నిర్ణీత తేదీ లోపు తిరిగి చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోరు పెరుగుతుంది.
- మీ క్రెడిట్ స్కోరు తక్కువగా రాకుండా ఉండటానికి మరొక రుణాన్ని తీసుకునే ముందు ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా మంచిది. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కోసం మీకు తగినంత నిధులు ఉండకపోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ త్వరగా పెరగాలంటే ఒక లోన్ తిరగి చెల్లించిన తర్వాతే మరో రుణాన్ని తీసుకోండి.
- రుణం తీసుకునేటప్పుడు డబ్బు తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం ఎంచుకోండి. దీనివల్ల ఈఎంఐ తక్కువగా ఉండటం వల్ల మీ మీద ఆర్ధిక భారం తగ్గుతుంది. మీరు అన్ని చెల్లింపులను సకాలంలో సులభంగా చేయగలుగుతారు. మీరు డిఫాల్టర్ల జాబితా నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అలాగే మీ స్కోర్ కూడా పెరగుతుంది.
- చాలా మంది తమ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం కోసం ఇష్టపడరు. కానీ, ఈసారి అలాకాకుండా బ్యాంకులు మీ కార్డు లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించొద్దు. దీని వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్ కూడా పెరుగుతుందని గమనించాలి. తక్కువ క్రెడిట్ కలిగి ఉండటం వల్ల మీ స్కోర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది.
సాధారణంగా ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితిని బట్టి మీ క్రెడిట్ స్కోర్‌ను పెరగడానికి 4- 13 నెలలు పడుతుంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు, రుణం తీసుకునేటప్పుడు తెలివిగా ఉండాలి.
చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
Comments
Please login to add a commentAdd a comment