
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నౌకను వచ్చే ఆగస్టులో దీన్ని నేవీకి అందిస్తారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో, అక్టోబర్‌లో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు.
చదవండి: మీసాలపై తగ్గేదేలే... తీయననంటే తీయను
తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని, స్వేచ్ఛాజలాల్లో(హై సీస్) పలు రకాల నౌకా విన్యాసాలు నిర్వహిస్తామని నేవీ ప్రతినిధి వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకకున్న సెన్సార్ సూట్లను కూడా పరీక్షిస్తామన్నారు. డీఆర్‌డీఓకి చెందిన ఎన్‌ఎస్‌టీఎల్ సైంటిస్టులు తాజా పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఈ నౌక నుంచి ఎంఐజీ జెట్లు, కమోవ్ హెలిక్యాప్టర్లును ప్రయోగించవచ్చు. దీని గరిష్ట వేగం 28 నాట్స్.
#WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu
— ANI (@ANI) January 9, 2022
కొచ్చిన్ షిప్‌యార్డ్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అనే యుద్ధ నౌక ఉంది. విక్రాంత్ నిర్మాణంతో సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకలున్న దేశాల జాబితాలోకి భారత్ చేరింది. కరోనా కారణంగా విక్రాంత్ పరీక్షల్లో జాప్యం జరిగింది. వీలైనంత త్వరగా ట్రయిల్స్ పూర్తిచేసి, సకాలంలో నౌకను నావికా దళంలో చేర్చేందుకు పలు సంస్థలకు చెందిన పలువురు నిపుణులు సంయుక్తంగా శ్రమిస్తున్నారని వివేక్ తెలిపారు.