సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆయుష్మాన్ భవ.. శతమానం భవతిః.. దీవెన ఏదైనా ఎక్కువకాలం హాయిగా బతికేయండి అన్న కోరికే. దీవెనలు ఏమోగానీ.. ఉత్తమ వైద్య విధానాలు, ఆరోగ్యంపై జాగ్రత్తలతో మనుషుల సగటు ఆయుర్దాయం మాత్రం పెరుగుతోంది. ‘ఆరోగ్యం అంటే.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తి హాయిగా జీవించే స్థితి. ఈ మూడు అంశాలే మనిషి ఆయుష్షును నిర్ధారిస్తాయి’ అన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూత్రీకరణ. దీనికితోడు కరోనా మహమ్మారి కారణంగా జనంలో ఆరోగ్యం పట్ల పెరిగిన జాగ్రత్తలూ ప్రభావం చూపుతున్నాయి.
ఇంటింటా ఆక్సిజన్, థర్మా మీటర్లు, ఆన్‌లైన్‌లోనూ డాక్టర్ సలహాలు, ఇంటి ముందుకే వచ్చే ఔషధాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామంపై ఆసక్తి.. వంటివి జీవనశైలిని మార్చేశాయి. ఇది ఆయుర్దాయం మరింతగా పెరిగేందుకు దోహదపడుతోంది. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం భారతదేశంలో సగటు ఆయుర్దాయం 63.9 ఏళ్లుకాగా... ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే–5 లెక్కల మేరకు 69.7 ఏళ్లకు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైతే సగటు ఆయుః ప్రమాణంలో జాతీయ సగటును మించిపోయాయి. 2003–04లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64.6 ఏళ్ల సగటు ఆయుర్దాయం ఉండగా.. తాజా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్‌లో 70.3 ఏళ్లు, తెలంగాణలో 69.8 ఏళ్లుగా నిర్ధారించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలతో (కేరళ మినహా) పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
అందరిలో ఢిల్లీ.. మహిళల్లో కేరళ..
తీవ్రమైన చలి ఓవైపు.. అధిక ఎండలు ఇంకోవైపు.. 3 నెలల పాటు ఊపిరి ఆడని కాలుష్యం ఇంకోవైపు కమ్మేస్తున్నా 75.9 ఏళ్ల సగటు ఆయుర్దాయంతో దేశంలో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేవలం మహిళల ఆయుర్దాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేరళ 78 ఏళ్ల ఆయుష్షుతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక దక్షిణ భారతంతో పోలిస్తే.. ఉత్తరాన చల్లని వాతావరణం, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ వంటి వాటితో ఆయుర్దాయం కాస్త ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనితోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో దేశ సగటును మించి మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఆయుష్షుపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
మెరుగైన వైద్య సౌకర్యాలతో..
దేశంలో కేన్సర్, గుండె, నాడీ సంబంధ వ్యాధులతో అకాల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ‘హెల్తీ ఫిట్ నేషన్’ దిశగా ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రజలకు మెరుగైన వైద్యం చేరువుతోంది. వ్యాధి నిర్ధారణ, మెరుగైన చికిత్సలకు మరోవైపు మహిళలు, పసిపిల్లల్లో పోషకాహార లోపం నియంత్రణ, వృద్ధుల కోసం నిర్వహిస్తున్న జెరియాట్రిక్ కేర్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో వచ్చే ఆరేళ్లలో ఉత్తరాది రాష్ట్రాలను మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయుర్దాయం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 80ఏళ్ల నుంచి 107 ఏళ్ల మధ్య వయసున్న వారు 4,87,950 మంది ఉన్నట్టు 2023 ఓటర్ల జాబితా గణాంకాలు చెప్తున్నాయి.
జగమంత కుటుంబం నాది..
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడకు చెందిన గంటా వెంకట రమణమ్మ వయసు 107 సంవత్సరాలు. తెలంగాణలో అందరికంటే పెద్ద వయసు వ్యక్తి ఈమెనే. దశాబ్దాలుగా మూడు పూటలా సంకటి, అంబలి తీసుకుంటూ పొలం పనులతో శారీరక శ్రమ చేసిన ఆమె.. ఇప్పటికీ మందులు, ఇంజక్షన్ల అవసరమే రాలేదని చెప్తున్నారు. ఆమెకు ఏడుగురు కొడుకులు, ఒక బిడ్డ. వారి సంతానం కూడా కలిపితే మొత్తం 186 మంది. ఇటీవలే రమణమ్మ జన్మదినం సందర్భంగా అంతా కలిసి వేడుక కూడా చేశారు.
5జీ బామ్మ
కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన మల్తుం బాలవ్వ వయసు 102 ఏళ్లు. ఆమెకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. వారి పిల్లలు, మనవళ్లతో కలిపి మొత్తం 94 మంది. ఇప్పుడు ఆమె ఐదో తరాన్ని (5జీ) చూస్తున్నారు. ఇటీవలే బాలవ్వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వెండి గిన్నెలో పాలు పోసి బంగారు పాత్రతో ఐదో తరం మునిమనవళ్లకు పాలు పట్టించింది ఆమె. భూమాతతో బంధం పోనివ్వనంటూ కాళ్లకు చెప్పుల్లేకుండానే పనులన్నీ చక్కబెట్టుకోవటం బాలవ్వ ప్రత్యేకత.
‘‘వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లతోపాటు శారీరక శ్రమతో ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది. దక్షిణాది వారితో పోలిస్తే ఉత్తర భారతీయులు శారీరక శ్రమ అధికంగా చేస్తారు. దానికితోడు అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల వల్ల కూడా..ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో సగటు ఆయుష్షుకాస్త ఎక్కువగా ఉంటుంది.’’
– డాక్టర్ సి.మోహన్‌రావు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment