భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ
న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ గురువారం వెల్లడించింది. సంబంధిత అంశాలను ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వివరించారు. ‘ మంగళవారమే ఆ ఎనిమిది మందితో సంప్రతింపుల జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది.
నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మనవాళ్లు మాట్లాడారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కలి్పంచేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని బాగ్చీ అన్నారు. వీరికి మరణశిక్ష ఖరారుచేస్తూ ఖతర్ కోర్టు అక్టోబర్ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కలి్పంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్వేíÙస్తోంది. ‘అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్ మరణశిక్ష మోపింది.
ఈ తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయబృందంతోనే భారత్ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు’’ అని బాగ్చీ చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్ న్యాయస్థానం బహిరంగంగా వెల్లడించలేదు.
కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్ తరఫున ఉన్నతాధికారులూ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ‘కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరూ ఈ అంశాన్ని సంచలనాల కోసం లేనిపోని రాద్దాంతాలు, వక్రభాష్యాలతో నింపేయకండి’ అని బాగ్చీ విజ్ఞప్తిచేశారు. మార్చి 25వ తేదీన మాజీ అధికారులపై కేసు నమోదుచేసి ఖతార్ చట్టాల కింద అరెస్ట్‌చేశారు.
మరణశిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. దళ సభ్యులకు ఇన్‌స్ట్రక్టర్‌లుగా పనిచేశారని మాజీ సైన్యాధికారులు గుర్తుచేసుకున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మే నెలలో దోహాలోని అల్ దహ్రా గ్లోబల్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. అందులో పనిచేసే సిబ్బందిని, ముఖ్యంగా భారతీయులను స్వదేశానికి పంపించేసింది.
Comments
Please login to add a commentAdd a comment