
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ పరువు మరోసారి పోయింది. గతంలోనూ కాలుష్యమయ నగరంగా పేరుమాసిన ఢిల్లీ తాజాగా 2022 ఏడాదికి దేశంలోనే అత్యంత కాలుష్యమయ నగరంగా రికార్డులకెక్కింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదలచేసింది. దీని ప్రకారం ఢిల్లీలో 2.5 స్థాయి(పీఎం) సూక్ష్మ ధూళి కణాలు నాణ్యత పరిమితికి మించి రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. 10 గాఢత విభాగంలో దేశంలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచిందని గణాంకాలు వెల్లడించాయి.
అయితే, నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే కాలుష్యం 7 శాతంపైగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం అని ఈ గణాంకాలను ఎన్‌సీఏపీ ట్రాకర్ విశ్లేషించింది. 2.5 స్థాయి సూక్ష్మధూళి కణాల విభాగంలో ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా, హరియాణాలోని ఫరీదాబాద్ రెండో ర్యాంక్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ మూడో ర్యాంక్‌లో నిలిచిందని గణాంకాలు పేర్కొన్నాయి. 10 పీఎం విభాగంలో దేశంలో ఘజియాబాద్ తొలిస్థానంలో నిలిచింది. తర్వాత ఫరీదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. కనీసం 20–30 శాతం కాలుష్యం తగ్గాలన్న జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్‌సీఏపీ) లక్ష్యాలకు ఈ గణాంకాలు సుదూరంగా ఉండటం విషాదకరం.
ఈ పథకం లక్ష్యాలను సాధించడంలో దేశ పురోగతిని గణిస్తూ ‘ఎన్‌సీఏపీ ట్రాకర్’ ఈ లెక్కలను విడుదలచేసింది. 131 నగరాల్లో కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించుకుంది. అయితే 2026కల్లా కాలుష్యం 40 శాతం తగ్గించుకోవాలని 2022 సెప్టెంబర్‌లో కొత్తగా లక్షించింది. 2.5 స్థాయి కణాలు అత్యంత సూక్ష్మంగా ఉండి నేరుగా ఊపిరితిత్తుల్లో అక్కడి నుంచి రక్తంలో కలిసిపోగలవు. ‘నగరాల్లో కఠిన నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయలేకపోతే లక్ష్యాలను సాధించడం చాలా కష్టం’ అని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా విచారం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment