న్యూఢిల్లీ: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో వరుసగా నాలుగో ఏడాది మన దేశం టాప్‌లో నిలిచింది. ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా 34 దేశాలలో కనీసం 182 సార్లు ఇంటర్నెట్‌ను మూసివేశారు. ఇందులో ఇండియావే 106 ఉన్నాయని టెక్ పాలసీ థింక్ ట్యాంక్ ‘యాక్సెస్ నౌ’ తన నివేదికతో పేర్కొంది.
ఆందోళనలను అరికట్టడం, ఆన్‌లైన్ మోసాలను నిరోధించే క్రమంలో గతేడాది భారత్‌లో 106 పర్యాయాలు ఇంటర్నెట్‌ను నిలిపివేయగా.. జమ్మూకశ్మీర్‌లోనే 85 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. 2020తో పోల్చుకుంటే ఈ సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. 2020లో భారత్‌లో 109 పర్యాయాలు ఇంటర్నెట్ బంద్ చేశారు.
2021 ఇంటర్నెట్ షట్‌డౌన్ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో మయన్మార్, సూడాన్, ఇరాన్ ఉన్నాయి. మయన్మార్‌లో కనీసం 15 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. సూడాన్, ఇరాన్ దేశాల్లో ఐదేసి పర్యాయాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ నమోదయింది. (క్లిక్: క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో)
సీమాంతర ఉగ్రవాదం ఎక్కువగా ఉండే జమ్మూకశ్మీర్‌లో నియంత్రణల కారణంగా అక్కడ ఎక్కువగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు నమోదవుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న సందర్భాల్లో రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి, కేంద్ర హోం సెక్రటరీ అభ్యర్థనల మేరకు ఇంటర్నెట్‌ను నిలిపేస్తుంటారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 సందర్భాలలో ఇంటర్నెట్‌ను నిలిపివేయగా.. భారత్‌లో 109 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. (క్లిక్: ఈ ఏడుగురు అద్భుతం.. మీ అందరికీ సలామ్!)
Comments
Please login to add a commentAdd a comment