కోల్‌కత్తా: దేశంలో పేర్ల మార్పిడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మొన్న మొతెరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చూస్తుంటే రేపొద్దున భారతదేశం బదులు నరేంద్ర మోదీ దేశంగా మారుస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ తనను తాను గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ధ్రువపత్రాలపై, ఇటీవల సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియానికి పేరు మారడాన్ని మమతా గుర్తుచేశారు.
ఎన్నికల ప్రచారంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాల్లో మమతాకు బీజేపీకి మధ్య పోరాటం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేర్కొనే గుజరాత్ వైపు ఒకసారి చూసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాకు హితవు పలికారు. బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు అని బీజేపీ చేసిన విమర్శలను కొట్టిపారేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఒకవైపు మమతా బెనర్జీ బహిరంగ సభ కొనసాగుతుంటే మరోవైపు తృణమూల్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment