న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 229 రోజుల కనిష్టానికి పడిపోవడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 3,40,67,719కు చేరుకుంది. శనివారం 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 14,146 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇక కరోనా యాక్టివ్ కేసులు రెండు లక్షలకు దిగువకి తగ్గిపోయాయి. ప్రస్తుతం 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇప్పుడేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.
ఒక్క రోజులోనే యాక్టివ్ కేసులు 5,786 తగ్గాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.57 శాతం ఉన్నాయి. ఇక కోవిడ్ రికవరీ రేటు 98.10 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారినపడి మరో 144 మంది మరణించారు. దీంతో మొత్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 4.52,124కి చేరుకుంది. కోవిడ్ టీకా డోసుల పంపిణీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శనివారం ఒక్కరోజే 41,20,772 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 97 కోట్లను దాటేసింది.
కరోనా మృతుల కుటుంబాలకు
యూపీ ప్రభుత్వం రూ.50 వేల సాయం
లక్నో: కోవిడ్–19 మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయం అందించే విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కరోనా ఆర్థిక సాయం పంపిణీకి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment