మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి ఎస్పర్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, భారత్‌లో అమెరికా రాయబారి జస్టర్
న్యూఢిల్లీ: దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాల రక్షణలో భారత్‌కు తోడుగా నిలుస్తామని అమెరికా స్పష్టం చేసింది. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని పేర్కొంది. రెండు దేశాల మధ్య మంగళవారం కీలకమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి. భారత్, అమెరికాల మధ్య ఇవి మూడో విడత 2+2 చర్చలు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, భారత్ తరఫున విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. తూర్పు లద్దాఖ్‌లో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో, పలు ఇతర ప్రాంతాల్లో చైనా దూకుడును ఎదుర్కొనే విషయమై చర్చించారు. చర్చల అనంతరం నలుగురు మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో భారత జవాన్లు మృతి చెందిన విషయాన్ని పాంపియో ప్రస్తావించారు. అధికార చైనా కమ్యూనిస్ట్ పారీ్ట(సీసీపీ) నుంచి ఎదురయ్యే సవాళ్లతో పాటు అన్ని ఇతర ప్రమాదాలను కలసికట్టుగా ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించుకునే దిశగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ‘సీసీపీ ప్రజాస్వామ్యానికి, పారదర్శక న్యాయపాలనకు వ్యతిరేకమన్న విషయంలో మనందరికీ స్పష్టత ఉంది. సీసీపీ నుంచే కాకుండా, అన్ని వైపుల నుంచి వచ్చే ముప్పులను భారత్, అమెరికాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి’ అని అన్నారు.
ఈ 2+2 చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య మొత్తం ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో కీలకమైన ‘బేసిక్ ఎక్స్‌చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ–బెకా)’ ఉంది. చర్చల్లో చైనా విస్తరణవాదంపైననే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామనే స్పష్టమైన సందేశాన్ని ఈ చర్చల సందర్భంగా వెలువరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ పరిస్థితిని సమీక్షించామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు కట్టుబడి ఉన్నామని సింగ్ పునరుద్ఘాటించారు. చర్చల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంపై ప్రధానంగా చర్చ జరిగిందని జైశంకర్ వెల్లడించారు.
చైనా ఆధిపత్యం భారత్‌కు ఆమోదనీయం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ‘బహుళ ధృవ ప్రపంచానికి భూమికగా బహుళ ధృవ ఆసియానే ఉండాలి’ అని తేలి్చచెప్పారు. ‘ఈ ప్రాంతంలోని అన్ని దేశాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం, అన్ని దేశాలు అభివృద్ధి చెందడం కీలకం. అందుకు అంతర్జాతీయ నిబంధనల అమలు, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం అత్యంత ఆవశ్యకం’ అని జైశంకర్ తెలిపారు. చైనా విస్తరణవాద దుందుడుకు చర్యల నేపథ్యంలో.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ వాదనకు యూఎస్ మద్దతునిస్తుందని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ స్పష్టం చేశారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం వృద్ధి చెందుతోందన్నారు. భారత్ పొరుగు దేశాల్లోని పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు.
ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ వద్ద నివాళులర్పిస్తున్న పాంపియో, ఎస్పర్
పాక్‌కు హెచ్చరిక
చర్చల అనంతరం రెండు దేశాలు ఒక సంయుక్త ప్రకటనను వెలువరించాయి. ఉగ్రసాయం నిలిపేయాలని, 26/11 ముంబై దాడులు, ఉడి, పఠాన్‌కోట్‌ల్లో ఉగ్రదాడులు సహా అన్ని ఉగ్రవాద దాడుల కారకులను శిక్షించాలని పాకిస్తాన్‌కు ఇరుదేశాలు విజ్ఞప్తి చేశాయి. తన అ«దీనంలోని ఏ భూభాగం కూడా ఉగ్రవాద దాడుల కోసం ఉపయోగపడకుండా కచి్చతమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు స్పష్టం చేశాయి. అణు శక్తి, సహజవాయువు, చమురు, అంతరిక్షం, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగ వాణిజ్యం, ఇరుదేశాల మధ్య ప్రజా సంబంధాలు.. తదితర అంశాలపై కూడా ఇరుదేశాల నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ఆరు అణు రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధానితో భేటీ
అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్, విదేశాంగ మంత్రి పాంపియో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు పంపించారని తెలిపారు. ఈ అభినందనలను స్వీకరిస్తూ.. ఈ ఫిబ్రవరి నెలలో ట్రంప్ భారత పర్యటనను మోదీ గుర్తు చేశారని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ కూడా పాల్గొన్నారు. ‘ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలు, విలువల పునాదులపై ఈ రెండు దేశాల సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం నిలబడి ఉంది’ అని ఆ భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
రక్షణ సహకారంలో ముందడుగు
వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో కీలకమైన నాలుగు ఒప్పందాల్లో చివరిదైన ‘బెకా’పై మంగళవారం ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వీటిలో మొదటిదైన ‘జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(జీఎస్‌ఓఎంఐఏ)’ 2002లో కుదిరింది. ఇది భారత్‌తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం. 2016లో ‘లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎల్‌ఈఎంఓఏ)’ కుదిరింది. రవాణాకు, మరమ్మతులకు ఇరుదేశాల సైన్యం పరస్పరం సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. 2018లో ఇరుదేశాలు ‘కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్(సీఓఎంసీఏఎస్‌ఏ)’పై సంతకాలు చేశాయి.
భారత్‌కు అత్యున్నత మిలటరీ సాంకేతికతను అమ్మేందుకు, రెండు దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఈ ఒప్పందం వీలు కలి్పస్తుంది. చివరగా, రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమక్షంలో మంగళవారం ‘బేసిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ కుదిరింది. అత్యాధునిక మిలటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్‌కు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం కుదరడం భారత్‌కు సానుకూల అంశమని నిపుణులు భావిస్తున్నారు. 2016లో భారత్‌కు మిత్రపక్షం హోదా కల్పిస్తూ ‘ముఖ్య రక్షణ రంగ భాగస్వామి’ అని అమెరికా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment