అమెరికా చదువులకే ఆదరణ | Indian Students Inclination Is Towards America | Sakshi
Sakshi News home page

అమెరికా చదువులకే ఆదరణ

Published Sat, Apr 9 2022 9:55 AM | Last Updated on Sat, Apr 9 2022 10:00 AM

Indian Students Inclination Is Towards America - Sakshi

సాక్షి, అమరావతి: అమెరికాలో చదివే భారత విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020తో పోలిస్తే 2021లో ఈ పెరుగుదల 12 శాతంగా ఉంది. ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉండగా విదేశీ చదువులకు భారత విద్యార్థుల మొదటి గమ్యస్థానంగా అమెరికా నిలుస్తోంది. అమెరికన్‌ డిగ్రీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తుండటం వంటి కారణాలతో భారత విద్యార్థులు అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

విద్యార్థుల చేరికలపై కోవిడ్‌ ప్రభావం..
ఇటీవల యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే 2021లో ఏకంగా ఎనిమిది శాతానికి తగ్గింది. మరోవైపు భారత విద్యార్థుల సంఖ్య 12 శాతం పెరిగింది. వాస్తవానికి.. ఈ సంఖ్య మరింత పెరిగేదని.. అయితే కోవిడ్‌ విద్యార్థుల చేరికలపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. కాగా, స్టూడెంట్స్‌ ఎక్సే్ఛంజ్‌ విజిటర్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఈవీఐఎస్‌) గణాంకాల ప్రకారం.. ఎఫ్‌1 కేటగిరీ, ఎం1 కేటగిరీల్లో అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 2021 విద్యా సంవత్సరంలో 12,36,748గా ఉంది. 2020లో చేరిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే 2021లో 1.2 శాతం తగ్గుదల నమోదైంది. 

చైనీయులు, భారతీయులే అత్యధికం
అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో చైనీయులు, భారతీయులే అత్యధికం. ఏటా చైనా నుంచి వచ్చే విద్యార్థులే ఎక్కువ కాగా.. 2021లో భారత్‌ నుంచి వెళ్లినవారి సంఖ్య పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి వెళ్లినవారిలో 33,569 మంది తగ్గారు. భారతదేశం నుంచి చూస్తే 2020లో కన్నా 2021లో 25,391 మంది అదనంగా పెరిగారు. వీరిలో 37 శాతం మంది మహిళలే కావడం మరో విశేషం. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకొనే విద్యాసంస్థల సంఖ్య కూడా 2020తో పోలిస్తే 2021లో తగ్గింది. 2020లో 8,369 విద్యాసంస్థలకు అర్హత ఉండగా 2021లో 8,038 సంస్థలకు మాత్రమే అర్హత దక్కింది. 

చైనా కన్నా అమెరికాకే ప్రాధాన్యం
కోవిడ్‌ అనంతరం చైనాలో చదువులపై భారతీయులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పైగా చైనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పదేపదే విద్యార్థులకు సూచిస్తోంది. దీంతో చైనాలో చదువులకు భారతీయులు అంతగా ఇష్టపడటం లేదు. పైగా కోవిడ్‌తో చైనాలోని పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో కోర్సులను అందిస్తున్నాయి.

ఇలా ఆన్‌లైన్‌లోకి మారే కోర్సులకు భారత్‌లో అనుమతులు ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదివేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఈ విద్యార్థుల్లో దాదాపు 92 శాతం మంది స్టూడెంట్‌ అండ్‌ ఎక్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ)–సర్టిఫైడ్‌ అసోసియేట్, బ్యాచిలర్, మాస్టర్స్‌ లేదా డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ కోర్సులు చదువుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement