
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్‌లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి.
మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్‌పూర్‌కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు.
14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.
దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు