పరిహారం ఏం చేస్కోవాలయ్యా.. అంకిత తండ్రి ఆవేదన | Justice For Ankita: Father Reject Jharkhand Govt Compensation | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది మాత్రమే కాదు.. వాడు మతోన్మాది కూడా! పరిహారం తిరస్కరించిన అంకిత తండ్రి

Published Mon, Aug 29 2022 7:41 PM | Last Updated on Mon, Aug 29 2022 8:15 PM

Justice For Ankita: Father Reject Jharkhand Govt Compensation - Sakshi

రాంచీ: చక్కగా చదువుకుంటున్న కూతురిని చూసి మురిసిపోతున్న ఆ తండ్రికి.. చివరకు శోకమే మిగిలింది. నిండా 20 ఏళ్లు పూర్తికాకుండానే పాడెకు ఎక్కింది ఆ బిడ్డ. ప్రేమ ముసుగులో ఓ ఉన్మాది ఘాతుకానికి బలైన అంకిత మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ప్రేమోన్మాది షారూఖ్‌ హుస్సేన్‌(19) చేతిలో బలైంది పదిహేడేళ్ల అంకితా కుమారి సింగ్‌. పొరుగింట్లోనే ఉండే షారూఖ్‌.. అంకితతో స్నేహం చేశాడు. అయితే తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. అంకిత తండ్రి సైతం షారూఖ్‌ కుటుంబంతో ఈ విషయంపై మాట్లాడాడు కూడా. అయితే.. షారూఖ్‌ వేధింపులు మాత్రం ఆగలేదు. ఆగస్టు 23వ తేదీన డుమ్కా పట్టణంలోని తన ఇంట్లో నిద్రిస్తున్న అంకితపై కిటికీ గుండా పెట్రోల్‌ పోసి.. నిప్పటించి పారిపోయాడు షారూఖ్‌.

తొంభై శాతం కాలిన గాయాలతో.. చికిత్స పొందుతూ చివరికి ఆదివారం కన్నుమూసింది అంకిత. ఈ ఘటన జార్ఖండ్‌నే కాదు.. యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్‌ ప్రభుత్వం సోమవారం అంకిత కుటుంబానికి పరిహారం ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి సోరెన్‌. అయితే ఈ ఆర్థిక సాయంపై అంకిత తండ్రి సంజీవ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. 

‘‘పరిహారం ఇప్పుడు ఏం చేస్కోవాలి. నా ఆర్థిక స్థితి నుంచి నా కూతురిపై దాడి జరిగిన రోజు నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం గనుక ఇదే సాయాన్ని ముందు అందించి ఉంటే.. మెరుగైన చికిత్స అందించి నా కూతురిని రక్షించుకునేవాడ్ని. ఆమె బతికేది ఏమో’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఆ సాయాన్ని వద్దని తిరస్కరించారాయన.  వాడు ప్రేమోన్మాది మాత్రమే కాదు.. మతోన్మాది కూడా. తనను వివాహం చేసుకోవాలని, ఇస్లాంలోని మారాలని, లేకుంటే జీవితాంతం నరకం చూపిస్తానని బెదిరించేవాడని అంకిత తమకు చెప్పి వాపోయిందని సంజీవ్‌ మీడియాకు వెల్లడించారు. తనకు పరిహారం అక్కర్లేదని.. తన కూతురి ఆత్మకు శాంతి కలిగేలా ఈ కేసులో న్యాయం కావాలని కోరుకుంటున్నారాయన. మరోవైపు అంకిత చికిత్స పొందుతుండగా.. తీసిన కొన్ని వీడియోలు.. తనపై జరిగిన దాడి తరహాలోనే నిందితులను చంపేయాలంటూ ఆమె కోరుకున్న వీడియోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. 

మరోవైపు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేసి తరలిస్తుండగా.. మీడియాను చూస్తూ నవ్వడం అతని ఉన్మాదస్థాయిని తెలియజేస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఇంకోవైపు ఎంక్వైరీ ఆఫీసర్‌గా నూర్‌ ముస్తఫాను నియమించడంపై స్థానిక యువత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నూర్‌ ముస్తాఫాపై తమకు నమ్మకం లేదని.. తన మతస్తుడికి మద్ధతుగా ఆమె దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందంటూ ఆరోపిస్తూ తక్షణమే ఆమెకు  ఇచ్చిన విచారణ బాధ్యతలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం ఈ ఘటన ఆధారంగా జేఎంఎం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అంకిత మృతదేహానికి‍ బీజేపీ నేతలు, భజ్‌రంగ్‌ దల్‌ సభ్యులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు.  మరోవైపు జస్టిస్‌ ఫర్‌ అంకిత హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు ట్విటర్‌ను కుదిపేస్తోంది.

ఇదీ చదవండి: బీజేపీ కార్పొరేటర్‌ ఇంట్లో కిడ్నాపైన పసికందు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement