
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆదివారం కాస్త మెరుగుపడిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్మా చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడినట్లు వెల్లడించారు. మరో 2 రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని.. ççస్పృహలోకి వచ్చారని వివరించారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ కూడా సాయంత్రం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడిందని.. అందర్నీ గుర్తు పడుతున్నారని చెప్పారు. తన తల్లి కూడా బుధవారంలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలిపారు.
బ్రదర్.. నీ కోసం ఎదురు చూస్తున్నాం: కమల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘సోదరుడా.. నీ కోసం ఎదురుచూస్తున్నాం. అనేక ఏళ్ల పాటు మీరు నాకు గొంతుకగా ఉన్నారు. నేను మీ స్వరానికి ముఖ చిత్రంగా ఉన్నాను. మీ స్వరం మళ్లీ ప్రతిధ్వనించాలి. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని ఎదురుచూస్తున్నాం’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.