
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి బెంగళూరు: కన్నడనాట కొత్తగా 3,222 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. 14,724 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 28.40 లక్షల మంది కోవిడ్ బారిన పడగా 27.19 లక్షల మంది బయటపడ్డారు. ఇంకా 85,997 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివిటీ రేటు 2.54 శాతంగా ఉంది. మంగళవారం 93 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాలు 34,929 కి పెరిగాయి. మరణాల రేటు 2.88 శాతంగా ఉంది. ఇక బెంగళూరులో కొత్తగా 753 మంది కరోనా బారిన పడగా, 16 మంది మరణించారు. టీకాలు, టెస్టులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
త్వరలో అన్‌లాక్–3
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జూలై 5న మూడో అన్‌లాక్‌ను ప్రకటించే అవకాశముంది. సాంకేతిక సలహా కమిటీ, సీనియర్ మంత్రులతో చర్చించిన తరువాత సీఎం బీ.ఎస్.యడియూరప్ప ఆ వివరాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలను మినహాయిస్తే 27 నుంచి 28 జిల్లాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. మైసూరు, దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో కొంచెం తీవ్రంగానే ఉంది. ఈ దఫా అన్‌లాక్‌లో మాల్స్, థియేటర్లు, పబ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు తదితర హైఎండ్ వ్యాపారాలను అనుమతి లభించే అవకాశముంది. ప్రస్తుతమున్న రెండో అన్‌లాక్‌లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు సాధారణ వ్యాపారాలకు, రవాణా సేవలకు అనుమతించడం తెలిసిందే. వీకెండ్ కర్ఫ్యూ యథాతథంగా ఉంది. మూడో అన్‌లాక్‌లో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేసే అవకాశముంది.
టెన్త్ పరీక్షలు ఇప్పుడా ?
మైసూరు: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మూడవ దశ ప్రారంభం అవుతుందని తెలిసి కూడా టెన్త్ పరీక్షల్ని నిర్వహించడం సరికాదు, విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకోవద్దు అని బీజేపి ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడో దశ త్వరలోనే దాడి చేయనుంది, ఈ సమయంలో పరీక్షలు జరపరాదని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment