బెంగళూరు: కర్ణాటక మహిళా అధికారుల వివాదం ప్రభుత్వ జోక్యంతో సరికొత్త మలుపు తిరిగింది. ఇద్దరు మహిళా అధికారిణిలకు అక్కడి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండానే.. ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తక్షణమే ఈ బదిలీలు అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.
బదిలీకి ముందుదాకా.. రూప కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇక సింధూరి ఏమో ధర్మాధయ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ బహిరంగ విమర్శలు చేసుకోవడం తెలిసిందే. మరోవైపు రూప భర్త మునీష్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన్ని పబ్లిసిటీ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. వీళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ, చర్యల తర్వాత పోస్టింగ్ విషయంలో ఒక స్పష్టత రావొచ్చని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత విమర్శలతో ప్రజలనే కాదు.. ప్రభుత్వాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆదివారం ఫేస్‌బుక్‌లో.. రూపా, రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను ఉంచడంతో వ్యవహారం మొదలైంది. తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడ్చిందంటూ రూపపై రోహిణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మరోవైపు రూప, రోహిణిపై అవినీతి విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి వ్యవహారంపై సీఎం బసవరాజ్ బొమ్మై కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ఆయన.. ఇద్దరిపై చర్యలు తప్పవనే సంకేతాలను నిన్ననే(సోమవారం) అందించారు.
Comments
Please login to add a commentAdd a comment