ఐఏఎస్ రోహిణి సింధూరి.. ఫోన్ కాల్‌లో రచ్చ.. ఐపీఎస్ రూప మౌద్గిల్
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే.
కాల్ లీక్ ప్రకంపనలు
తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్‌లో ప్రస్తావించారు.
ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్‌డీ.కుమారస్వామి, హెచ్‌డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది.
మైసూరులో ఆడియో విడుదల
ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రూపా నన్ను పావుగా వాడాలని చూశారు.
ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా.రా మహేశ్‌కు పంపించారు.
చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి
నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment