సాక్షి, న్యూఢిల్లీ: ‘యతో ధర్మ: తతో జయః.. దేవుడు మా వెంటే ఉన్నాడు. ఎవరికీ భయపడేది లేదు. ఎప్పటికీ ప్రజల కోసమే పని చేస్తాను’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారత్ జాగృతి నేతృత్వంలో నిర్వహించనున్న నిరాహారదీక్షకు సంబంధించి గురువారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తనకిచ్చిన నోటీసుల అంశంపై ఆమె స్పందించారు. ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరవుతానని.. ఎప్పుడు, ఎక్కడికి రమ్మని పిలిస్తే అక్కడి వెళతానన్నారు. అయితే విచారణ సమయంలో చట్టప్రకారం మహిళలకు ఉండే అధికారాలను విచారణ సంస్థలు గౌరవించాలన్నారు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎందుకు జరపరు? అవసరమైతే మా ఇంటికి వచ్చి ఎందుకు విచారించరు?’అని ప్రశ్నించారు. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు.
ధర్మం ఎవరివైపు ఉంటే వారిదే విజయం..
‘మహాభారత యుద్ధ సమయంలో దుర్యోధనుడు తల్లి గాంధారి ఆశీర్వాదం కోరతాడు. అయితే దుర్యోధనుడు అన్యాయం వైపు ఉన్నాడని తెలుసు కాబట్టి ఆమె ‘యతో ధర్మః.. తథో జయః’అని కొడుకును ఆశీర్వదిస్తుంది. నేనూ అదే చెబుతున్నాను. ధర్మం ఎవరివైపు ఉంటే వారికే విజయం లభిస్తుంది. జైలులో ఉంచినంత మాత్రాన కృష్ణుడి పుట్టుకను ఆపలేకపోయారు. అజ్ఞాతవాసంలో ఉన్న కారణంగా అర్జునుడి శౌర్యం ఏమాత్రం తక్కువకాలేదు.
వనవాసానికి వెళ్లిన తర్వాత శ్రీరాముడు మరింత బలవంతుడిగా మారి లోకకల్యాణం కోసమే పనిచేశారు. మేము దేవుడి కంటే బలవంతులమని ఎవరికైతే అనిపిస్తుందో... విచారణ సంస్థలు సహా అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నామని భావిస్తారో, అప్పుడు ప్రకృతే న్యాయం చేసేందుకు ముందుకొస్తుంది. బీజేపీ నియంతృత్వ పాలనను అడ్డుకొని న్యాయం చేసేందుకు ప్రకృతి ముందుకు రావడం ఖాయం’అని కవిత పేర్కొన్నారు.
వందలాది మందిపై దాడులు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని 500 వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు, వందమందిపై సీబీఐ, 200 మందిపై కేంద్రం ఈడీ దాడులు చేయించిందని కవిత దుయ్యబట్టారు. తనతోపాటు పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు 16 మంది ప్రజాప్రతినిధులపై రాజకీయ దురుద్దేశంతోనే విచారణ సంస్థలతో దాడులు చేయించిందని ఆరోపించారు.
అలాగే సుమారు 600 మందిని ఎన్‌ఐఏ విచారణకు పిలిపించి భయపెట్టిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆశ ఉంటే తొలుత రాష్ట్ర ప్రజల మనసులు గెలవాలని, ఆ తర్వాతే అధికారం గురించి ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి
దేశంలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ ఇప్పటికైనా అహంకారా న్ని వీడాలన్నారు. ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో సవాళ్లు ఏమీ లేవని.. అయితే దేశంలోని అన్నిచోట్లా బలంగాలేని కాంగ్రెస్ ప్రతిపక్షాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, జాతీయ పార్టీ అనే భ్రమ నుంచి బయటికి రావాలని సూచించారు. విపక్షాలకు నేతృత్వం వహించాలని కాంగ్రెస్ భావిస్తే తొలుత ఆ పార్టీ అహంకారాన్ని వదిలిపెట్టి వాస్తవాలను గ్రహించాలని ఆమె సూచించారు.
ముందు ఈడీ.. తర్వాతే మోదీ
ఈ ఏడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గతేడాది జూన్ నుంచి మోదీ ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపించడం ప్రారంభించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ కొత్త సంప్రదాయాన్ని పాటిస్తోందని... ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ముందుగా ఈడీ వెళ్తోందని.. ఆ తర్వాతే మోదీ వస్తున్నారన్నారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను చూసి భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్నారు.
బీఎల్ సంతోష్ కు భయమెందుకు?
ప్రతిపక్షాలకు చెందిన తనలాంటి నాయకులను వేధించడం ద్వారా ఏం సాధించాలనుకుంటుందో బీజేపీ స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని, అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కవిత కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ముందుకు బీఎల్ సంతోష్ హాజరై అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబులివ్వాలన్నారు. అన్ని అంశాల్లోనూ కేంద్రం అబద్ధాలాడుతూ కాలం వెళ్లదీస్తోందని, వన్ నేషన్– వన్ ఫ్రెండ్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇవ్వరాదని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment