కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో బట్టబయలై ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. కోవిడ్ విసిరిన పంజాతో అగ్రరాజ్యం అమెరికా కుదేలైంది. యూరప్ దేశాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తూ ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో థర్డ్ వేవ్ బెంబేలెత్తిస్తోంది. దీంతో కేజ్రీవాల్ సర్కారు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ : పంట వ్యర్థాలు కాల్చడానికి తోడు పండుగ రోజులు తోడు కావడం, ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. అక్టోబర్ చివరి వారం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. జన సాంద్రత ఎక్కువ ఉండే మార్కెట్లను మూసివేయ డానికి అనుమతి ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. అంతేకాదు వివాహాలు, వేడుకలకి 200 మంది వరకు హాజరు కావచ్చునన్న నిబంధనల్ని మళ్లీ మార్చేశారు.
పెళ్లిళ్లకి 50కి మించి హాజరు కాకూడదని మంగళవారం ఆన్‌లైన్ ద్వారా జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ఉధృత రూపం దాల్చింది,. ప్రజలెవరూ మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. అందుకే రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడం తప్ప మా ముందున్న మరో మార్గం లేదు. ఈ మేరకు కేంద్రానికి కొన్ని ప్రతిపా దనలు పంపాము. కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరిస్తే ఎప్పుడైనా లాక్ డౌన్ విధిస్తాం. ఇప్పటికే నగరంలో కోవిడ్–19 హాట్ స్పాట్‌లను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది’’అని కేజ్రీవాల్ చెప్పారు.
అనూహ్యంగా పెరిగిన కంటైన్మెంట్ జోన్లు
కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేస్తున్న కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరిగింది. అక్టోబర్ 28న వాటి సంఖ్య 3,113 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 4,430కి చేరుకుంది. శీతాకాలంలో ఢిల్లీలో రోజుకి 15 వేలకు పైగా కేసులు నమోదవుతాయని అంచనాలున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు రోజుకు లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నామని, ఐసీయూ బెడ్లను 6 వేలకు పెంచినట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది.
4 నెలల తర్వాత 30 వేల దిగువకు
దేశంలో సరిగ్గా నాలుగు నెలల తర్వాత 30 వేలకు దిగువన కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. జూలై 15న చివరిసారిగా 30 వేలలోపే కేసులు నమోదు కాగా, తాజాగా మంగళ వారం నమోదయ్యాయి. 24 గంటల్లో కేవలం 29,163 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,74,290కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా మరో 449 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,30,519కు చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య మంగళవారానికి 82,90,370గా, యాక్టివ్ కేసుల సంఖ్య 4,53,401గా ఉంది.
డబ్ల్యూహెచ్‌వోలో 65 మందికి కోవిడ్
జెనీవా: యూరప్ మొత్తమ్మీద కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యాల యంలో 65 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న డబ్ల్యూహెచ్‌వోలోని సిబ్బంది 65 మంది కోవిడ్ బారిన పడినట్లు వెల్లడైంది. ద అసోసియేటెడ్ ప్రెస్ చేజిక్కించుకున్న ఓ మెయిల్ ద్వారా ఈ విషయం తెలిసింది. వ్యాధి సోకిన వారిలో సగం మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని, 32 మంది మాత్రం కార్యాలయానికి వస్తున్నారని వెల్లడైంది. జెనీవాలో ఎవరికీ కోవిడ్ సోకలేదని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment