
ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి గైర్హాజరయ్యారు. గడిచిన రెండు నెలల్లో ఈడీ పంపిన నాలుగు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేజజ్రీవాల్ వెళ్లలేదు. ఈడీ నోటీసులపై ఆయన స్పందించారు.
ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని, అవి పూర్తిగా చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఆపడానికే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ నోటీసులన్నీ రాజకీయ కక్ష్యలో భాగమేనని, ఇలాంటి నోటీసులన్నింటినీ కోర్టు ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వస్తోందని కేజ్రీవాల్ గుర్తు చేశారు.
‘నన్ను ఎన్నికలకు రెండు నెలల ముందు విచారణకు ఎందుకు పిలవాలి. ఈడీని బీజేపీయే వెనుక ఉండి నడిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు నన్ను దూరం చేయడమే వారి ఉద్దేశం‘ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, నాలుగుసార్లు నోటీసులు వస్తే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందుకు ఎందుకు వెళ్లడం లేదు. ఆయన భయపడుతున్నారా అని బీజేపీ నేత గౌరవ్ భాటియా ప్రశ్నించారు.