తిరువనంతపురం: క్రికెట్‌కు అంతులేని ఆదరణ ఉన్న మన దేశంలో ఈ నూతన వధూవరులు ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కేరళకు చెందిన సచిన్.ఆర్, ఆర్.అథీరా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రోజు జరిగింది. అర్జెంటీనా స్టార్ అటగాడు మెస్సీకి సచిన్ వీరాభిమాని. అథీరాకు ఫ్రెంచ్ టీమ్ అంటే ప్రాణం. ఫైనల్‌కు కొన్ని గంటల ముందే కొచ్చిలో వీరి పెళ్లి జరిగింది.
దాంతో సంప్రదాయ దుస్తులు, నగలతోపాటు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ జెర్సీని సచిన్, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపె జెర్సీని అథీరా ధరించి పెళ్లి పీటలపై కూర్చున్నారు. వివాహమై విందు పూర్తియన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు కొత్త దంపతులు కొచ్చి నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురంలోని వరుని ఇంటికి ఆగమేఘాలపై చేరుకున్నారు. సచిన్‌కు ఇష్టమైన అర్జెంటీనా సంచలనం విజయం సాధించడంతో చివరికి ఇరువురూ సంబరాలు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, అర్జెంటీనా గెలిస్తే ప్రజలకు ఉచితంగా బిర్యానీ వడ్డిస్తానని కేరళలోని త్రిసూర్‌లో ఓ హోటల్ యజమాని ముందే ప్రకటించాడు. చెప్పినట్లుగానే తన హోటల్‌కు వచ్చిన వారందరికీ ఉచితంగా బిర్యానీ పంపిణీ చేసి మాట నిలుపుకున్నాడు!
చదవండి: మెస్సీ అసోంలో పుట్టాడు..!
Comments
Please login to add a commentAdd a comment