వయనాడ్‌: కేరళ మంత్రి వీణా జార్జ్‌కు తప్పిన ప్రమాదం | Kerala Health Minister Veena George Vehicle Met With Accident | Sakshi
Sakshi News home page

వయనాడ్‌: కేరళ మంత్రి వీణా జార్జ్‌కు తప్పిన ప్రమాదం

Published Wed, Jul 31 2024 8:45 AM | Last Updated on Wed, Jul 31 2024 9:43 AM

Kerala Health Minister Veena George Vehicle Met With Accident

తిరువనంతపురం: కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వయనాడ్‌కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ వాహనం ప్రమాదానికి గురైంది. బుధవారం ఆమె వయనాడ్‌ వెళ్తున్న సమయంలో మలప్పురం జిల్లాలోని మంజేరి వద్ద ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న మంజేరి మెడికల్‌ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స జరగుతోందని తెలిపారు. అయితే, వయనాడ్‌ ప్రమాద ఘటన పరిశీలనకు వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

 

 

ఇదిలా ఉండగా.. కాగా, కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్‌ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 151 మృతదేహాలను వెలికితీశారు. సమీపంలోని టీ ఎస్టేట్లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement