సాక్షి, న్యూఢిల్లీ: లఖిమ్‌పూర్ ఖేరి ఘటనలో ఉత్తరప్రదేశ్ సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా రోజువారీ పర్యవేక్షించడానికి మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొంది. లఖిమ్‌పూర్‌ఖేరి ఘటనపై సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటనపై న్యాయ పర్యవేక్షణకు పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్ రాకేష్‌కుమార్ జైన్ లేదా జస్టిస్ రంజిత్ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తును పర్యవేక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్‌పై విశ్వాసం లేదని పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్ యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ‘రైతులపై నుంచి వాహనం దూసుకెళ్లడం, రైతుల ఆగ్రహించి బీజేపీ కార్యకర్తలను హతమార్చిన వేర్వేరు ఘటనలపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ సాక్షుల విచారణ కలిపి జరుగుతోందని భావిస్తున్నాం. ప్రత్యేకించి ఒక నిందితుడిని కాపాడడానికే ఇలా జరుగుతోంది అని అనిపిస్తోంది. అందుకే కేసులో ఆధారాలు మిళితం కాలేదని నిర్ధారించడానికి, దర్యాప్తును పర్యవేక్షించడానికి ఇతర రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ జడ్జిని నియమించాలని భావిస్తున్నాం. దీనిపై శుక్రవారంలోగా యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
విడివిడిగా దర్యాపు చేయాల్సిందే
ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు ఉన్నాయని పేర్కొంది. ‘మూడో కేసుకు సంబంధించి పరిశోధన సిట్ కొనసాగించలేకపోతోందని అనుకుంటున్నాం. ఇలాంటి గందరగోళంలో స్వతంత్ర న్యాయమూర్తుల పర్యవేక్షణ సబబని భావిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. విడివిడిగా దర్యాప్తు చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. తాజా పరిస్థితి నివేదికను పరిశీలించామని, మరికొంత మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొనడం తప్ప మరేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పది రోజులు సమయం ఇచ్చినా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రాలేదని, కోర్టు అనుకున్నట్లుగా దర్యాప్తు సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ అవసరం లేదని పునరుద్ఘాటిస్తూ... ఈ కేసుకు రాజకీయ డిమాండ్లను జోడించదలచుకోలేదని, రిటైర్డ్ జడ్జీతో స్వతంత్ర పర్యవేక్షణ కోరుకుంటున్నామని తెలిపింది.
రాష్ట్రప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని యూపీ తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే కోరారు. విచారణ నిమిత్తం ఎనిమిది సెల్‌ఫోన్లు తీసుకున్నామని, ఈ నెల 15 లోగా ఫోరెన్సిక్ నివేదికలు అందజేస్తామని సాల్వే తెలిపారు. ఆశిష్ ఫోన్ మాత్రమే సీజ్ చేశారని, మిగిలిన నిందితుల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరం లభ్యం కాలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకొని మిగిలినవి సాక్షులవి స్వాధీనం చేసుకుంటారా అని నిలదీసింది. రాజకీయ కార్యకర్త శ్యాంసుందర్ మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టాలని మరో న్యాయవాది కోర్టును కోరగా... అన్ని సమస్యలకూ సీబీఐ పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వరకూ వేచిచూడాలని నిష్పాక్షిమైన దర్యాప్తు జరగడానికి ప్రయతిస్తున్నామని పేర్కొంది. ‘‘రెండు కేసుల్లో అవే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడికి ప్రయోజనం చేకూర్చాలని భావించినట్లు ప్రాథమికంగా భావించాల్సి వస్తోంది. వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల సాక్ష్యాలు కలగలిసిపోతున్నాయని అనిపిస్తోంది. ఇలా వ్యాఖ్యానించినందుకు మరోలా భావించొద్దు. ఒక ఎఫ్‌ఐఆర్‌లో సాక్ష్యాలు మరో దాంట్లో ఉపయోగించొచ్చు అంటున్నారు. అప్పుడు కేసు ఏం కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు హత్య: లఖింపూర్ ఘటనలో కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు మృతి చెందినట్లు భావిస్తోందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం తరఫు లాయర్ హరీష్ సాల్వే ఏకీభవించారు. మూకదాడి వల్ల మృతిచెందారని తొలుత భావించామని కానీ అలా కాదని సాల్వే తెలిపారు.
లఖిమ్‌పూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Published Tue, Nov 9 2021 2:00 AM | Last Updated on Tue, Nov 9 2021 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment