ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా రహదారి పనులకు ఆ స్థలాల్ని అప్పగించి నష్ట పరిహారంగా రూ. 200 కోట్లను ఓ రియల్టర్ మింగేశాడు. ఇద్దరు అధికారుల చేతి వాటంతో ఈ వ్యవహారం సాగి ఉండటంతో కేసును సీబీఐకు సిఫారసు చేస్తూ రెవెన్యూ కమిషనర్ పంకజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నుంచి పూందమల్లి– శ్రీపెరంబదూరు – కాంచీపురం – వేలూరు మీదుగా బెంగళూరు వైపు జాతీయ రహదారి సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ రహదారి పనులకు గతంలో స్థల సేకరణ జరిగింది. స్థలాల్ని ఇచ్చిన వారి నష్ట పరిహారాల చెల్లింపులు కూడా జరిగాయి. ఇందులో ఓ రియల్టర్ అధికారులతో కలిసి మాయాజాలం చేసి ఉండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. రహదారి పనులకు, ఆ తదుపరి విస్తరణ పనులకు అంటూ సాగిన స్థల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున మోసం జరిగి ఉన్నట్టు తాజాగా బయట పడింది. శ్రీపెరంబదూరు ఆర్టీఓగా ఇటీవల చార్జ్ తీసుకున్న వెంకటేషన్ పరిశీలనలో స్థల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వానికే అమ్మి రూ. 200 కోట్లు
శ్రీపెరంబదూరు సమీపంలోని బీమన్ తాంగల్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికే అమ్మి ఉండటం ఆ పరిశీలనలో తేలింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ రహస్యంగానే సాగింది. శ్రీపెరంబదూరులో ఆర్టీఓగా పనిచేసి పదవీ విరమణ పొందిన రాధాకృష్ణన్, పూందమల్లి సెటిల్‌మెంట్ అధికారి షణ్ముగం గారడి బయట పడింది. ఈ ఇద్దరి రియల్టర్ అశీష్ మెహత ద్వారా తమ వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు.
ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా, వాటిని ఆశీష్ మెహత పేరిట మార్చేసి, సెటిల్ మెంట్ సమయంలో సర్వే నెంబర్లను మార్చేసి పెద్ద మాయాజాలమే సృష్టించి ఉండడం బయట పడింది. అంతే కాదు, శ్రీ పెరంబదూరు పరిధిలో జాతీయ రహదారి ఆశీష్ మెహత అనేక చోట్ల స్థలాల్ని కేటాయించి ఉండటం, తద్వారా రూ. 200 కోట్లను నష్ట పరిహారంగా ప్రభుత్వం నుంచి తీసుకుని ఉండటం వెలుగు చూసింది. దీంతో ఈ వ్యవహాన్ని సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణలో తమకు లభించిన ఆధారాలు, సమగ్ర వివరాలను సీబీఐకి పంపుతూ, ఈ కేసు విచారణకు స్వీకరించాలని రెవెన్యూ కమిషనర్ పంకజ్‌కుమార్ కోరడం గమనార్హం.
చదవండి: చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment