ఎలుగుబం‍ట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం? | Largest Rescue Centre Celebrates World Bear Day | Sakshi
Sakshi News home page

World Bear Day: ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం ఎందుకు చేస్తారు?

Published Sat, Mar 23 2024 1:16 PM | Last Updated on Sat, Mar 23 2024 3:19 PM

Largest Rescue Centre Celebrates World Bear Day - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన  కల్పించే ప్రయత్నం చేస్తారు. 

ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. 

ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్  ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం  ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి.

అమెరికన్ బ్లాక్ బేర్
అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. 

ఆసియన్ బ్లాక్ బేర్‌
దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. 

స్పెక్టాక్లెడ్‌ బేర్‌
ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్‌ బేర్‌ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి.

జెయింట్ పాండా
జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి.

సన్ బేర్ 
ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్‌ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. 

స్లాత్ బేర్
స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్,  శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి  కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి.

బ్రౌన్ బేర్
బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు  ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు.

పోలార్ బేర్
పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ  కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. 

ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు
గత రెండు దశాబ్దాలో స్లాత్‌ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా  ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి.  

ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్‌ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ  రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా  ఉన్నాయి.  ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. 

ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం
యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్‌ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు  ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్‌ఏఓస్‌కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్‌లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్‌ ఉంది. 

1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్‌.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్‌ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు  ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది.

ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్‌ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము  ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement