సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షం నుంచి రక్షించుకునేందుకు చెట్టు కిందకు చేరిన వ్యక్తులు అనూహ్య ప్రమాదంలో ఇరుక్కున్నారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరమైన ఈ విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు ఈ నలుగురు చెట్టుకింద నిలబడ్డారు. అకస్మాత్తుగా పిడుగువారిపై పడింది. అంతే క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని హార్టికల్చర్ సిబ్బందికి చెందిన వారుగా తెలుస్తోంది.
కాగా సాధారణంగా పిడుగులు పడేటప్పుడు అందరూ చెట్లకిందకు, భవనాలు కిందకు వెళుతుంటారు. వాస్తవానికి ఇది ఇంకా ప్రమాదకరం. ఈ సమయంలో చెట్లకింద నిలబడకూడదని నిపుణులు హెచ‍్చరిస్తున్నారు. పిడుగులు ఎత్తైన వాటిని ఆకర్షిస్తాయి. దీంతో చెట్లపైనా, ఎత్తైన భవనాలపైనే పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment