బరిలో పలువురు ప్రముఖులు
కృష్ణానగర్‌లో మహువా వర్సెస్ అమృత
బహ్రాంపూర్‌లో అదీర్, యూసఫ్ పఠాన్
ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 13న పోలింగ్
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...
కృష్ణానగర్
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు.
లోక్‌సభలో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్‌సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్‌ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
బహ్రాంపూర్
పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్‌స్టాప్‌గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది.
1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్‌ఎస్‌పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్‌లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్‌కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్‌ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్‌గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.
భోల్పూర్
బెంగాల్లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్‌తో పాటు బీర్భుమ్ లోక్‌సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్‌ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్‌లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్‌పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్‌కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాణాఘాట్
బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్‌నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్‌పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్‌దే విజయం. నియోజకవర్గాల పునర్‌విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి.
అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్‌లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్‌కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.
బర్ధమాన్ – దుర్గాపూర్
దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్‌లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్‌కు గురై కాంగ్రెస్‌లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు.
బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్‌పై బీజేపీ నేత ఎస్‌ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్‌కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్‌ను నిలబెట్టింది.
బీర్భుమ్
2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్‌కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్‌ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.
ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్
పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్‌సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment