
కోల్‌కతా: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం పునరావృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో ఈ చంద్రగ్రహణం చక్కగా కనిపిస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దురై శనివారం తెలిపారు.
సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని వివరించారు. ఇలాంటి గ్రహణం 580 సంవత్సరాల క్రితం.. అంటే 1440 ఫిబ్రవరి 18న చోటుచేసుకుందని వివరించారు. మళ్లీ ఇలాంటిదే చూడాలంటే 2669వ సంవత్సరం ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలన్నారు.