
యూపీలోని లక్నో లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్‌పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్‌నాథ్ సింగ్‌ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్‌ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.
నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. స్టయిలిష్ లుక్‌లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్‌సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment