స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల కళేబరాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వేటగాళ్లు రెచ్చిపోయారు. వన్యమృగాలను వేటాడుతుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులు నేలకొరిగారు. ఒకరు పోలీసు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అనంతరం సోదాల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో నిందితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుణ జిల్లా అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను మృతవీరులుగా ప్రకటించారు. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గ్వాలియర్ జోన్ ఐజీని బదిలీ చేశారు. సాగ బార్ఖేడ గ్రామ సమీపంలోని షారోక్ రోడ్డు వద్ద కొందరు దుండగులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారం అందడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసు బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను దుండగులు లక్ష్యపెట్టలేదు. పోలీసులపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎస్సై రాజ్‌కుమార్ జాటవ్, కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారాం మీనా అసువులు బాశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన నేరగాళ్లు బిధోరియాకు చెందిన వారిగా గుర్తించినట్లు హోం మంత్రి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో నలుగురి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోందన్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి కృష్ణజింకల కళేబరాలు ఐదు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి.
చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు
Comments
Please login to add a commentAdd a comment