సాక్షి, చెన్నై(తమిళనాడు): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడంతోపాటు కోవిడ్ ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు.
తాజాగా, మద్రాసు హైకోర్టు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలంటూ సూచించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్‌లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు.ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆమె కోరారు.
పర్యాటకులు, రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితంగా ఉండేలా చూడాలన్న ఆదేశాలు ఇదివరకే జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment