సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై సెంట్రల్ జైల్లో చోటుచేసుకున్న భారీ గోల్‌మాల్ బట్టబయలైంది. ఖైదీల కష్టాన్ని కొందరు అధికారులు కూడబలుక్కుని కాజేశారు. బూటకపు లెక్కలు చూపి, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి రూ.100 కోట్లను స్వాహా చేసినట్లు తేలడంతో ప్రభుత్వ గణాంకాల విభాగం విచారణ చేపట్టింది. డాక్యుమెంట్ల పునఃపరిశీన మొదలు కావడంతో జైలు అధికారుల్లో గుబులు మొదలైంది.
నేపథ్యం ఇదీ..
మధురై సెంట్రల్ జైల్లో వెయ్యిమందికి పైగా శిక్ష, విచారణ ఖైదీలున్నారు. ఖైదీల ప్రయోజనాల కోసం వైద్యపరమైన బ్యాండేజ్, ఫైళ్ల తయారీ సహా పలు వృత్తులకు ఖైదీలతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలకు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు రాసి రూ.100 కోట్లు కాజేసినట్లు గత ఏడాది ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. 2016–21 మధ్య కాలంలో ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2021 జూన్ మధ్యకాలంలో మాత్రమే రూ.30 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ కూడా జరగడంతో ఈ గోల్‌మాల్‌లో ఉన్నతాధికారులకు కూడా వాటా వెళ్లినట్లు తెలుసుకున్నారు. 2019 జూలైలో జైలు నుంచి రెండు సైజుల్లో పదివేల కాగితపు కవర్లు, 250 ఫైళ్లు పొందినట్లు మ«ధురై జిల్లా కోర్టుల్లో రికార్డుల్లో నమోదై ఉంది.
అయితే జైలు రికార్డుల్లో మాత్రం రెండు లక్షల కవర్లు సరఫరా చేసినట్లు ఉంది. ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భారీఎత్తున ఉత్పత్తులను సరఫరా చేసినట్లు బూటకపు లెక్కలు రాసుకున్నట్లు గణాంకాల విభాగం అధికారులు గత ఏడాది జరిపిన విచారణలో గుర్తించారు. దీంతో కంగారుపడిన జైలు అధికారులు జైల్లోని రికార్డుల్లో లెక్కలను తారుమారు చేస్తూ.. ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ అవినీతి వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించాల్సిందిగా ఖైదీల హక్కుల సంఘం సంచాలకులు పుహళేంది మద్రాసు హైకోర్టులో గత ఏడాది నవంబర్‌లో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేశారు. అయితే తగిన ఆ«ధారాలు లేకుండా పిల్‌ను స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మధురై సెంట్రల్ జైల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు సమాచార హక్కుచట్టం కింద డాక్యుమెంట్లు పొందినట్లు పిటిషనర్ కోర్టుకు చెప్పుకున్నారు. పూర్తి ఆధారాలతో కొత్తగా మరో పిల్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ పిటిషనర్‌ను ఆదేశించింది.
ఈ మేరకు సవివరమైన ఆధారాలతో పుహళేంది మరోసారి పిల్ వేశారు. ఈ కుంభకోణంలో అప్పటి మధురై జైలు సూపరింటెండెంట్, డీఐజీల పాత్ర ఉన్నందున రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, జైళ్లశాఖ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్‌లో పేర్కొన్నారు. ఈ కారణం చేత ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. తాము జారీ చేసిన ఉత్తర్వులు ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని కూడా తమ ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ముమ్మరంగా పరిశీలన
ఫోర్జరీకి గురైన డాక్యుమెంట్లను గణాంకాల విభాగం అధికారులు జవహర్, శ్రీధర్ తదితరులు మధురై జైల్లో తిష్టవేసి పునఃపరిశీలన చేస్తున్నారు. గోల్‌మాల్‌ను కప్పిపుచ్చుకునేందుకు డాక్యుమెంట్లలో దిద్దుడుకు పాల్పడిన విషయం పునఃపరిశీలనలో తేలింది. ఏ మూల నుంచి ఎలాంటి ముప్పు మూడుతుందోనని జైలు అధికారులు కంగారుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment