
కొడనాడు ఎస్టేట్ కేసు ఐదేళ్లయినా ఒక కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని అన్న, భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తేరి సమీపంలోని కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు టీ ఎస్టేట్, బంగ్లా ఉన్నాయి. వారు ఏడాదికి రెండుసార్లు ఈ ఎస్టేట్‌లో కొన్నాళ్లు సేదదీరడం అలవాటు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2017 ఏప్రిల్ 23వ తేదీ అర్దరాత్రి కొందరు అగంతకులు ఎస్టేట్‌లో ప్రవేశించి ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. అడ్డు వచ్చిన ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ను హతమార్చారు. జయలలిత వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన కనకరాజ్ సహా 11 మంది దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
చదవండి: (ఫడ్నవీస్‌కు గడ్కరీ పాఠం?)
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కనకరాజ్ అను మానాస్పద స్థితిలో మరణించాడు. అదే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ రాత్రి సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని చందనగిరి అనే ప్రాంతంలో కనకరాజ్ మృతదేహం లభించగా సయాన్ అనే వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని కోర్టులో సయాన్ పిటిషన్ వేయడంతో కొడనాడు లోని కొత్తేరి పోలీసులు పునర్విచారణ చేపట్టారు. దక్షిణ మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తన తమ్ముడు కనకరాజ్‌ను పథకం ప్రకారం హత్య చేశారని అన్న ధనపాల్ విచారణాధికారికి ఫిర్యాదు చేశాడు.
చదవండి: (దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన)
అలాగే కనకరాజ్ భార్య కలైవాణి సైతం తన భర్త మరణంలో అనుమానాలు ఉన్నాయని వాంగ్మూలం ఇచ్చింది. ఈ కారణంగా కనకరాజ్ మృతిపై పునర్విచారణ జరపాల్సిందిగా సేలం జిల్లా ఎస్పీ అభినవ్ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక విచారణాధికారిగా ఆత్తూరు డీఎస్పీ రామచంద్రన్‌ను నియమించారు. ఆయన శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించారు. 20 మందికిపైగా పోలీసులు ఐదు వాహనాల్లో ఉదయం 6.45 గంటలకు అత్తూరుకు వచ్చారు. శక్తినగర్‌లోని కనకరాజ్ బంధువుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment