
తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అదే గనుక నిజమైతే తాను రాజీనామా చేస్తానని సవాలు కూడా విసిరారు మమత. ఎన్నికల సంఘం తృణమూల్ పార్టీ అర్హతను సమీక్షించిన తర్వాత జాతీయ పార్టీ హోదాను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మమతపై సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు కాల్ చేసి మమత అభ్యర్థించారని ఆయన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై స్పందించిన మమత..నేను అమిత్ షాకు ఫోన్ చేసి అడిగినట్లు నిజమైతే ఈ క్షణమే నా పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలను విని తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానన్నారు. సువేందు అబద్ధాలు చెబుతున్నాడంటూ విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న యత్నాల గురించి కూడా వ్యాఖ్యానించారు.
కొన్నిసార్లు మౌనం చాలా గొప్పదని, ప్రతిపక్షాలు కలవవని అనుకోవద్దన్నారు. మేమందరం ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నామని, అది ఒక్కసారిగా గాలివానాల వస్తుందని అన్నారు. అంతేగాదు స్వలింగ వివాహ చట్టం గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన విషయం అని, ప్రజల నాడి తోపాటు కోర్టు ఆదేశాలను కూడా చూసి ఒక అభిప్రాయానికి రావాలన్నారు.