అందంగా ఉంది. పైగా చనువుగా మాట్లాడుతోంది. ఇంకేం.. అనుకున్న ఆ యువకుడు ఫోన్ నెంబర్ అడిగాడు. నెంబర్ ఇవ్వడమే కాదు.. రొమాంటిక్ మెసేజ్‌లతో మత్తులో ముంచెత్తిన ఆమె, ఓ రోజు అతగాడిని ఇంటికి ఆహ్వానించింది. గాల్లో తేలుతూ వెళ్లిన ఆ యువకుడికి షాక్ తగలగడమే కాదు.. పైప్రాణాలు పైనేపోయినంత పని అయ్యింది.
కేరళ తిరువనంతపురం అదిమలతురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న బాధితుడు.. ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. ఓ అమ్మాయి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేది. ఆ పరిచయంతో నెంబర్‌లు ఇచ్చిపుచ్చుకున్న ఆ ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్‌తో గడిపారు. ఈ క్రమంలో.. ఓరోజు అతన్ని ఇంటికి ఆహ్వానించింది ఆమె. తీరా ఆమె బెడ్రూమ్ దాకా వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆమె భర్త ఆ కుర్రాడిని కట్టిపడేశాడు.
అంతేకాదు.. ఆమెలా వాట్సాప్‌లో ఛాటింగ్ చేసింది కూడా ఆ భర్తే అని తెలిసి సదరు యువకుడు కంగుతిన్నాడు. విషయం అర్థమయ్యే సరికి తనని వదిలిపెట్టాలని బతిమాలాడాడు ఆ కుర్రాడు. చివరకు.. లక్ష రూపాయల డబ్బు, అతని కారు ఇస్తే వదిలేస్తామని.. ఆఫర్ ఇచ్చాడు ఆమె భర్త. అయితే తన దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయని, మిగతా డబ్బు కోసం కజకుట్టమ్‌లో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్లాలని కోరాడు ఆ కుర్రాడు.
ఆ వ్యక్తి, అతని స్నేహితురాలు సోని(18), మరో వ్యక్తి.. ఆ కుర్రాడి కారులో బయలుదేరారు. తీరా విలింజమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు చేరుకోగానే.. సడన్ బ్రేక్ వేసి నేరుగా పోలీస్ స్టేషన్‌లోకి పరిగెత్తాడు బాధితుడు. పోలీసులకు తన గోడు వెల్లబోసుకోగా.. సిబ్బంది బయటకు వచ్చేలోపు నిందితులంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment