సోమవారం కొచ్చిలో రోడ్‌షో సందర్భంగా అభిమానులకు ప్రధాని మోదీ అభివాదం
కొచ్చి: దేశ అభివృద్ధి ప్రయాణానికి యువ శక్తే చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ మారడం వెనుక యువత భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా యువత కృషి వల్ల సాధ్యమవుతోందని పేర్కొన్నారు. వారిపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు.
కేరళలోని కొచ్చిలో సోమవారం ‘యువం–2023’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతటా అందరూ చెబుతున్నారని, యువ శక్తి మన దేశానికి ఒక పెన్నిధి అని వివరించారు. తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని, యువత వాటి ఫలితాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతిగా మారుపేరుగా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం యువత కోసం నూతన అవకాశాలను సృష్టిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు.
స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. భారత్ ఎప్పటికీ మారబోదని గతంలో ప్రజలు భావించేవారని, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి భారత్‌కు ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోందని అన్నారు.
మోదీకి ఘన స్వాగతం
మోదీకి సోమవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్‌ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువం సదస్సు వేదిక దాకా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తులను ధరించారు. కాసేపు నడిచి, తర్వాత వాహనం నుంచి అభివాదం చేశారు.
కాంగ్రెస్ పాలనలో పల్లెలపై సవతి తల్లి ప్రేమ
రేవా: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పల్లెలపై సవతి తల్లి ప్రేమ చూపాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని, గ్రామ సీమల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో బహిరంగ సభలో ఆయన అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల్లో కోత పెట్టి, ఎన్నికలను వాయిదా వేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment