సాక్షి, రొద్దం: ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని బొక్సంపల్లి క్రాస్ సమీపాన పావగడ–పెనుకొండ ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందిగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల మేరకు తుమకూరు జిల్లా పావగడ తాలూకా వెంకటమ్మనళ్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహ వేడుకకు సంబంధించి కొత్త బట్టలు కొనడానికి కారులో బెంగళూరుకు వెళ్లారు.
దుస్తులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో ఉండగా, బొక్సవపల్లి క్రాస్ సమీపాన వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. తీవ్ర గాయాలతో వేణు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవారని తెలిసింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. గాయపడిన మృతుడి భార్య , పిల్లలు, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
పావగడ: కారు ప్రమాదంలో కాంట్రాక్టరు, జేడీఎస్ నాయకుడు అయిన ఎగువపల్లి వేణు మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వేణు తన బావమరిది పెళ్లికి బట్టలు, ఇతర సామగ్రి తీసుకువస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ జరిగినట్లు బంధువులు తెలిపారు. మరో బంధువు అశ్వర్థప్పకు కాలు విరిగింది, వేణు భార్య భార్గవి, కుమారుడు వికాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇంకా ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలై బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో చదువుతున్న మరో కుమారుడు నితిన్ వచ్చాక ఆదివారం అంత్యక్రియలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, జేడీఎస్ నాయకులు వేణు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
(చదవండి: కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే)
Comments
Please login to add a commentAdd a comment